25 August 2011

సరసాలాడుతున్న గోపాలకృష్ణుడు...

ఈ రోజుల్లోలాగ ఎక్కడబడితే అక్కడ దాహశాంతికి చల్లని పానీయాలు (కూల్ డ్రింకులు) ఉండేవి కాదారోజుల్లో. ఎంచక్కా మజ్జిగమ్మేవారు ఆడవాళ్ళు. మజ్జిగకన్నా దాహశాంతినిచ్చే చల్లటిపానీయాలు వేఱేవి ఉండవని నా అభిప్రాయం.

సన్నివేశం : మజ్జిగమ్మే ఒక గొల్లభామతో సరసాలాడుతున్నాడు యదుకుల నందనుడు. ఆ గొల్లభామ ఏం తక్కువైంది కాదు. తనూ గొప్ప జాణే (నేర్పరే)!
 ఈ కీర్తన విని కిరణ్ గీసిన బొమ్మ ఇది


నువ్వమ్మే మజ్జిగకు ఇంత రుచి ఎలా వచ్చింది? దూడ త్రాగి మిగిలిన పాలను పిండి, కాచి, చేమిరి తోడేసి ఆ పెరుగుని మజ్జిగ చేయడంవలన వచ్చిందా? లేక ఈ గొల్లభామచేత చిలకడబటంవల్ల ఇంత రుచి వచ్చిందా? అని కొంటెగా చమత్కారం చూపుతున్నాడు అల్లరి చిల్లరి బాలకృష్ణుడు. ఆ గొల్లభామకూడా కొంటెగానే సమాధానమిస్తుంది.

ఆ దృశ్యాన్ని అన్నమయ్య యుగళ గీతంగా(Duet) రాశారు. అన్నమయ్య ఎన్నో కీర్తనలను జానపదశైలీలో రాశారు. చెప్పాలనుకున్న భావాన్నిబట్టి శైలీనేంచుకున్నారు. ఇదొకరకమైన Teasing song. ఇందులో పదప్రయోగాలు అద్భుతంగా ఉంటాయి. 

ఆ చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్నది తిరుమలగిరి శ్రీవేంకటేశుడే! ఆ సొగసరిగొల్లెత ఎవరో కాదు; ఆ పురుషోత్తముణ్ణి వరించిన అలమేలుమంగ నాంచారమ్మే... వాళ్ళను పలువేఱురూపాలలో ఊహించుకుని పాటలుకట్టడమే అన్నమయ్యెంచుకున్న భక్తి మార్గం. మీరే వినేయండి పాటని.
===============================================
రాగం : శ్రీరాగం
గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరచి జానకి గారితో పాడిన
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
 (సాహిత్యానికీ AUDIOకీ ఉన్న కొన్ని తేడాలను గమనించగలరు)
===============================================

పల్లవి
జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు గొల్లలా

చరణాలు :
పొయవే కొసరుజల్ల బొంకుగొల్లెతా వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మాయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి
పోయవొ పోవొ మాచల్ల పులుసేల నీకును?

చిలుకవే గోరం జల్ల జిడ్డుగొల్లెతా వోరి
పలచని చల్ల నీకు బాతికాదురా
కలచవే లోనిచల్ల గబ్బిగొల్లెతా వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు?

అమ్మకువే చల్లలు వొయ్యారిగొల్లెతా వోరి
క్రమ్మర మాతోడ నిట్టే గయ్యాళించేవు
సొమ్మెలం బోయేవేలే సొంపుగొల్లెతా వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
జాణతనము = నేర్పరితనము, టెక్కు
జంపు = మందము
గొల్లెత = గొల్లభామ
గొల్లలా = కొల్లగా వస్తాయా

కొసరు = ఇంక కాస్త
బొంకు = అబద్ధము
మాయకువే = మోసంచెయ్యకువే, దాయకువే
జాడిముచ్చు = కపటుము, కపటి

గోరం = త్వరగా
జిడ్డుగొల్లెతా = హుషారులేకుండ జాగారే గొల్లభామ
పలుచని = నీరెక్కువున్న
బాతికాదురా = నచ్చదురా / సరిపోదురా
కలుచవే = కలియతిప్పు
గబ్బిగొల్లెతా = బడాయి గొల్లభామా
తొలరా = తొలగిపోరా, వెళ్ళిపోరా

క్రమ్మర = వచినదారి చూడరా, వెనక్కెళ్ళరా, get lost
గయ్యాళించేవు = విసుగించేవు, వాదించేవు
సొమ్మె = మైమర
సొంపుగొల్లెతా = సొగసొలికే గొల్లభామా
దిమ్మరి = భ్రమపడిన
తిరమైతి = స్థిరమైతిని

తాత్పర్యం :
చిన్నికృష్ణుడు : నాక్కొంచం మజ్జిగపోసి వెళ్ళమంటుంటే టెక్కుచూపుతున్నావెందుకే జంపుగొల్లెతా?
గొల్లెత :  ఆణిముత్యాలకన్నా మేలైనవిరా మా చల్లలు; అవి నీకు దోపిడి ఇచ్చినట్టు ఊరికే ఇవ్వాలా? పైకమివ్వు మజ్జిగపోస్తాను.

చిన్నికృష్ణుడు : డబ్బులిచ్చి కొనుక్కున్నోళ్ళకు మజ్జిగిచ్చి కొంచం 'కొసరు' మజ్జిగపోస్తావుకదా? డబ్బుళ్ళేవు నాదగ్గర, నాకు ఆ కొసరుమజ్జిగ మాత్రం పొయ్యి.
గొల్లెత :  రోజూ నీతోపడలేక చస్తున్నాన్రా. మాయింటి చల్లే యెందుకు నచ్చుతుందో నాకర్థం కాదు.
చిన్నికృష్ణుడు : ఓ కపటమెఱిగిన గొల్లెతా, మాటలుచెప్పి మజ్జిగపొయ్యకుండా మాయమైపోవాలని చూడకు.
గొల్లెత :  నీకు తెలియదు. ఈ మజ్జిగ చండాలమైన పులుపుగా వుంది. ఈ మజ్జిగ బాగుండదు వెళ్ళు.

చిన్నికృష్ణుడు : నీకు తెలుసుకదా నాకు పుల్ల మజ్జిగే ఇష్టం. జాగుచెయ్యకుండా త్వరగా చిలికి పోసివెళ్ళవే.
గొల్లెత : ఈరోజు మజ్జిగ బాగా పలచగా వున్నాయ్. అందుకే నీకు మజ్జిగ పొయ్యడంలేదు. నీకు నచ్చదులే వెళ్ళు.
చిన్నికృష్ణుడు : అదేంపలచగాలేదులేగానీ, కొంచం అలా చెయ్యొపెట్టి చిలికిపొయ్యి చిక్కటి మజ్జిగ అడుగునుంటుంది.
గొల్లెత :  దొరా, ఎంతచెప్పినా వినవా? గొప్పింటీ పిల్లాడివి! ఇలాంటి చల్ల నీకెందుకులే వెళ్ళిరా.

చిన్నికృష్ణుడు : ఓసి ఒయ్యారి గొల్లభామా, మరి అలాంటి చల్లెందుకు అమ్ముతున్నావే?
గొల్లెత :  నెమ్మదిగా చెప్తున్నాను, నన్ను విసిగించకు. వచ్చిన దారిన తిరుగెళ్ళిపో, అదే నీకు మంచిది.
చిన్నికృష్ణుడు : సొగసరి గొల్లెతా, విసుక్కోకుండ ప్రేమగా మైమరచి మజ్జిగపొయ్యొచ్చుకదా నాకు? వెంటనే వెళ్ళిపోతాను.
గొల్లెత :  నామీద మనసుపడి ఆ కొండలుదిగివచ్చిన కోనేటిరాయుడా! ఊరికే అలా ఉడికించానంతే! నువ్వే నా పంచ ప్రాణాలని ఎప్పుడో మనసులో స్థిరంచేసుకున్నాను. 
==============================================================

rAgaM : Sree rAgaM


pallavi

jANatanA lADEvElE jaMpugolletA vOri
ANimutyamula challalavi neeku gollalA


charaNAlu :

poyavE kosarujalla boMkugolletA vOri
mAyiMTi challEla neeku manasayyeerA
mAyakuvE challa chADimuchchu golletA vOri
pOyavo pOvo mAchalla pulusEla neekunu?

chilukavE gOraM jalla jiDDugolletA vOri
palachani challa neeku bAtikAdurA
kalachavE lOnichalla gabbigolletA vOri
tolarA mA challEla doravaiti neeku?

ammakuvE challalu voyyArigolletA vOri
krammara mAtODa niTTE gayyALiMchEvu
sommelaM bOyEvElE soMpugolletA vOri
dimmari kOnETirAya tiramaiti neekunu

==============================================================

21 August 2011

నన్నిటు చూడగ నవ్వితివి...

ఏ బంధంలోనైనా పంతాలూ, సాధింపులూ సహజం. అభిమానం, ప్రేమ ఉన్నచోటేగా కోపాలూ, తాపాలూ ఉంటాయ్? ప్రేమించేవారి మీదేగా కోపంచూపగలం? ఊరికే దారినపొయ్యేవాణ్ణి పిలిచి "ఒరేయ్ బడుద్ధాయ్, నీ మీద నాకు కోపమొచ్చింది! నీతో మాట్లాడను" అన్నామనుకోండి, మనల్ని ఎగా దిగా చూసి "అలాగే నాయనా, నువ్వు నాతో మాట్లాడకపోవడమే మంచిది. అది నా పూర్వజన్మ సుకృతం" అంటాడు.

ఆలు-మగలు బంధంలో ఎంతకెంత ప్రేముంటుందో అంతకంత పంతాలుంటాయ్. వీరి ఈగోల(ego) గోలలో కొన్నిసార్లు న్యాయం ఉండచ్చు, కొన్ని సార్లు అసలు లేకపోవచ్చు. ఇక్కడ అమ్మవారికీ-అయ్యవారికీ ఇదే ప్రాబ్లం.

చోటు : తిరుమల
సమయం : సుమంగళి స్త్రీ నుదుటి తిలకంలా తూర్పుకొండలపైన భానుడు మెఱస్తున్నాడు

చిరునవ్వుతోకాకుండ, ఎందుకో ఈ రోజు చిరాకుతో మొదలైంది, అమ్మవారికి! ఎవరిమీద చూపగలదు చిరాకునీ, కోపాన్నీ? ఉన్నది ఆయనేగా? ఆమె చిరాగ్గా ఉందని తెలియక మామూలుగా "నాస్తా తయారైందా? ఇంద్రలోకంలో జరిగే దేవతల సమావేశానికి వెళ్ళాలి. సమయమైంది" అన్నారు అయ్యవారు. ఆనకట్టేసిపెట్టిన అమ్మవారి కోపానికి ఈ ప్రశ్న గండి వేసింది. అమ్మవారు అక్షింతలు చల్లడం మొదలుపెట్టారు. 'ఓకరు కోపంగా ఉన్నప్పుడు మఱొకరు మౌనంగా ఉండాలి' అన్న వారి ఒడంబడిక ఆ కోపక్షణాలలో గుర్తు రాలేదు. ఏ కారణం లేకుండ నా మీద అరవడమేంటి యని అయ్యవారు కోపపడ్డారు. అల్పాహారము తినకుండా వెళ్ళిపోయారు. ఎంత కోపమున్నా ఆహారం మీద చూపకూడదన్న మఱో ఒడంబడికనూ మరిచాడని ఇంకా కోపమొచ్చింది అమ్మవారికి.

"మీరలిగెళ్ళిపోతే నాకు ముద్ద దిగదనుకున్నారేమో" అని కంచం ముందర పెట్టుకున్నారు. ఆయనమీద కోపంలో తిందాం అనుకున్నారుగానీ నిజానికి ఆయన తినకుండా వెళ్ళిపోయారన్న బాధ ఆమెను తిననివ్వలేదు. కాసేపటికి, తానెందుకు అలా ప్రవర్తించిందో అని నొచ్చుకుని పశ్చాత్తాపపడ్డారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడు తనదే తప్పంతా అని ఒప్పుకుని ఆయన చేత క్షమాపణ చెప్పించుకుందామని నిర్ణయించుకున్నారు. [పెళ్ళికాని వారంతా, ఇదెక్కటి విడ్డూరం అనుకుంటారేమో - పెళ్ళైతే తెలుసుతుంది! ఇద్దఱిలో తప్పెవరు చేసినా క్షమాపణ మాత్రం మొగుడే చెప్పాలి. అదే ఇక్కడ (అ)ధర్మం!]

ఇంద్రలోకం చేరుకున్న అయ్యవారి మనసంతా కలతలమేఘాలు ఆక్రమించుకున్నాయ్. సమావేశంలో ముఖ్య అతిథి ఈయనే. మనసొకచోట, మనిషొకచోట అనే రీతిలో సమావేశంలో పాల్గొన్నారు. భోజనవిరామం. పరవమశివుడు, "బావా, నాతోబాటు ఇంటికి రావచ్చుగా?" అంటే. భవుడు పిలిచి వెళ్ళకుంటే బాగుండదేమోనని ఆయనతోబాటు మాట్లాడుతూ నడిచారు. ఉదయం ఇంట్లో జరిగినదంతా మనసులో మెదిలింది. ఇప్పుడేం చేస్తుంటుందో అని ఊహించుకున్నారు. తను ఆహారమేమీ తినలేదుకాబట్టి తన ఇల్లాలుకూడా ఏమి తినదు అనుకున్నారు. అయినా ఇప్పటికిప్పుడు వెళ్ళి తిరిగిరావడం సాధ్యమా? అని ఆలోచిస్తుండగానే కైలాసము చేరుకున్నారు ఇద్దఱూ.


పార్వతిదేవికి ఆనందమేసింది అన్నగారి రాక. శివుడు 'నేనెంత మంచి పని చేశానో చూడు' అనే రీతిలో కోంచం గర్వంగా ఫీల్ అయ్యాడు. కుశలప్రశ్నలు అడిగింది, పార్వతి. కాసేపటికి, భోజనం వడ్డిస్తాననగా


"నాకొద్దమ్మా, మీ వారికి వడ్డించు. ఇవాళ మీ వదినేదో నోమునోచుకుంటుంది! అందుకని రోజంతా ఉపవాసముంటుంది. తను ఉపవాసమున్న రోజుల్లో నేనూ ఉపవాసముంటాను. ఏమనుకోవద్దు. ఇంతదూరమొచ్చాను, ఒక్కసారి నిన్ను చూసివెళ్దామని ఇటువచ్చాను. మఱోరోజు ఇద్దఱం కలిసి వస్తాం భోజనానికి" అని అబద్ధమాడారు.


టక్కున పార్వతి శివునివంక చూసింది, ఈ సంభాషణ వింటున్నాడో లేదో అని. నిజానికి శివుడు వీరి సంభాషణను పూర్తిగా వినలేదు. పార్వతి చూపుల్లో ఏదో ఒక ఆజ్ఞ ఉందని మాత్రం గ్రహించాడు.  ఎందుకైనా మంచిదిలే అని 'నువ్వేమంటే అదే' అనే భావంతో తలూపాడు.


"ఎప్పుడో ఒక్కసారి ఇటు దయచేస్తావు. అలా వచ్చినప్పుడే ఉపవాసం పెట్టుకోవాలా" అని నొచ్చుకుంది, పార్వతి. శివుడి భోజనం పూర్తయ్యాక మళ్ళి ఇంద్రలోకం చేరుకున్నారు.

ఇంక ఇక్కడ, తిరుమలగిరిపైన అమ్మవారేమో మధ్యాహ్నం వస్తాడు అయ్యవార అని వేచిచూస్తున్నారు.  మధ్యాహ్నంకూడా దాటిపోయింది. ఆయనేమోరాలేదు. రాకపోయినా గరుత్మంతుడిచేత వర్తమానమైనా పంపించలేదు రావడంలేదని. మఱింత బాధేసింది అమ్మవారికి. ఇక ఆయనొచ్చేది సాయంకాలమే అని అర్థమైంది. రాత్రి భోజనం తయారుచేసి ఆయనకోసం గుమ్మంపట్టుకు నిల్చున్నారు.


ఆహారంలేక అలసివచ్చిన అయ్యవారికి, నీరుకారే కళ్ళతో గుమ్మంపట్టుకుని నిలుచున్న ఆమెను చూడగానే బాధేసింది! ఆయ్యవారు పలకరించారు. అమ్మవారు విసురుగా "నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు" అన్నారు. 'అన్నెంపున్నెం ఎఱుగని నన్ను తిట్టావు? అయినా నేనే దిగివచ్చి పలకరించాను. నువ్వు బెట్టుచేస్తావా' అని ఆయనా, 'మధ్యాహ్నం రావడంలేదన్న ముక్క గరుత్మంతుడితోనైనా వర్తమానం పంపుండచ్చుగా?' అని ఆమే, కొపాన్ని అలానే కొనసాగించారు. మౌనంగా ఆహారం ఆరగించారు.

ఆలుమగలు మధ్య ఎటువంటి గొడవైనా సరే రాత్రి నిద్రపోయేసమయానికి ఎవరో ఒకరు తగ్గి సంధి చేసుకుని సమాధానమైపోవాలి. ఒకేపానుపుపైన వైరముతో ఉన్న ఇద్దఱిని  నిద్రదేవి ఎలా అక్కునచేర్చుకోగలదు? 

అమ్మవారే దిగొచ్చారు. ఆయన దగ్గరకెళ్ళి,
"ఉదయం అలా మీమీద అలా విరుచుకుపడ్డాను; తప్పెల్లా నాదే! అయితే మీరేం చేశారు? 'ఒకరు కోపపడినప్పుడు మఱొకఱు శాంతంగా ఉండాలి' మీరు మన ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దానికి దీనికి సరిపోయింది. అదేకాదు, 'ఎంత కోపమున్నా ఆహారం మీద చూపకూడదు' మీరు ఈ ఒప్పందాన్నికూడా అతిక్రమించారు. నా ఒక్క తప్పుకి, మీరు చేసిన రెండు తప్పులు చెల్లుబడి అయిపోయింది. రండి, కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదాం" అని శ్రీరాగం లో ఆలకిస్తున్నారు అమ్మవారు. అంత తీయగా బ్రతిమాలుతుంటే అయ్యగారు కరిగిపోరాయేంటి? 

(కీర్తన/తాత్పర్యం చదివాక 'అమ్మవారేంటీ, పతిని ఏకవచనంలో సంబోధిస్తున్నారు? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధము కదా?' అని అడుగుతారేమో. నిజానికి పతిని మీరు, గారు, ఆయన అని సంబోధించడం మనం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చుకున్న మిథ్య ఏమో అని నా ఉద్దేశము. మన ప్రాచీన సాహిత్యాలు తిరగేస్తే, పతిని ఏకవచనంలో సంబోధించేటట్టు సూచించే ఘట్టాలు కోకొల్లలు. అలా సంబోధించడంలో అనంతమైన వాత్సల్యభావామే ఉంటుందికానీ, అవమానమేమీ కాదని గుర్తించాలి.)

===============================================
రాగం : శ్రీరాగం
కౌశల్య గారి గళంలో గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరచిన
 AUDIO
 (సాహిత్యంలోని కొన్ని పదాలను Tune కొసం మార్చిపాడారని గమనించగలరు)
===============================================

పల్లవి 
పంతము చెల్లెను బదగదరా
యింతలోన దప్పు లెంచక పదరా
 
చరణం 1
రాని కోపమున రవ్వ సేసితి నింతే
పానుపుమీదికి బదగదరా
సోనలచెమటల సొలసితి నింతే 
తేనెమోవి దప్పి దేర్చె బదరా
 
చరణం 2
అనుమానానీకు నలిగితి నింతే 
పని గల దిక నటు పదగదరా
నను నిటు చూడగ నవ్వితి నింతే
తనిపే నీమతి తావుకు పదరా
చరణం 3
పాసిన కాకల బలికితి నింతే
బాసలు నమ్మితి బదగదరా
ఆసల శ్రీవేంకటాధిప కూడితి
వేసారపురతి వెనకకు బద

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

పంతము = పౌరుషము
చెల్లెను = తీరిపోయింది, సరిపోయింది
పదగదరా = వెళ్దాంరారా
తప్పులెంచకు = తప్పుపట్టకు

రాని కోపమున =  పైపైకి నటిస్తున్న కోపంతో
రవ్వ సేసితి నింతే = రట్టడి చేశాను అంతే
పానుపుమీదకి = మంచంమీదకి
పదగదరా = వెళ్దాం రారా
సోనలచెమటల = చెమటలవర్షంతో
సొలసితి నింతే = నీరసపడిపోయాను
తేనెమోవి = తేనెలూరే పెదవుల
దప్పి దేర్చు పదరా = దప్పికి తీర్చుకుందాం పదరా

అనుమానానీకు = నువ్వు కోపంగా వెళ్ళాక  ఎక్కడెలా ఉన్నావో అని ఆలోచిస్తూ
నిలిగితి నింతే = నలిగిపోయాను
పని గల దిజ నటు = నీతో పనుంది
పదగదరా = వెళ్దాం రారా
నను నిటు చూడగ = నువ్వు ఇందాక ఓరకంటితో చూసినప్పుడు
నవ్వితి నింతే = (నువ్వు రాజీపడిపోదామని) నవ్వాను
తనిపె నీమతి = నీమనసులోని కోపంచాల్లారింది
తావుకు పదరా = చోటికి(మంచం దగ్గరకి) పదరా

పాసిన కాకల = పాతబడిపోయిన కోపముతో(కోపం తగ్గిపోయిందట)
పలికితి నింతే = మాట్లాడాను అంతే
బాసలు నమ్మితి = నువ్వు ఏం చెప్తే అవే నిజమని నమ్మేశాను
పదగదరా = వెళ్దాం రారా
ఆస =  ప్రేమ
వేంకటాధిప = వెంకటాద్రిని ఏలేటీ అధిపతి
కూడితి = కూడాను
వేసారపు = విసుక్కోకుండ
రతి వెనుకకు = రతి వెనుకగు = సంగమానికి జతకాడిగా
బదరా = పదరా = వెళ్దాంరారా

తాత్పర్యం :
నేను పట్టిన పంతానికి, నువ్వు పట్టిన పంతాలు చెల్లుబాటైపోయింది. ఇంక తప్పులెంచకుండ రాజీపడిపోదాం రా, స్వామీ.


ఉదయం అదేదో చిరకుతో ఉన్నాను, ఆ కోపం అప్పుడే కాసేపటికి మాయమైపోయింది. నేనే అనవస్రంగా రట్టడి చేశాను, తప్పునాదే! ఈరోజంతా నిన్ను ఇబ్బందిపెట్టాను. ఇప్పుడు అవన్ని మరిచిపోయి కబుర్లుచెప్పుకుంటూ పడుకుందాం పద. ఉదయంనుండి నీగురించే ఆలోచిస్తున్నాను. మనసంతా అలజళ్ళై, ఒళ్ళంతా చెమటలుపట్టేశాయి. నీరసపడిపోయున్నాను. గుక్కెడు మంచినీరైనా తాగలేదు. గొంతెండిపోయింది. నీ పరిస్థితికూడా అదే అని నాకు తెలుసు. తేనెలూరే పెదవులతో దాహాలు తీర్చుకుందాం పద.


నువ్వుతినకుండా కోపగించుకుని వెళ్ళిపోయావు. ఎక్కడికెళ్ళావో, ఎలా ఉన్నావో, ఎప్పుడొస్తావో అని ఆరాటంలో నలిగిపోతున్నాను. నా ఐదునిముషాల కోపానికి రోజంతా వేదనపడమని వదిలెళ్ళిపోతావా? పానుపుమీదకి రా నీపని చెప్తాను. ఇందాక భోజనంచేస్తుండగా ఓరకంట ఓ క్షణం అలా నావైపు చూశావు, రాజీపడిపోదామని వెంటనే నేను స్నేహంగా నవ్వాను. నువ్వూ నవ్వుతావని చూశాను. దొంగ నువ్వు! బిగువుగా చూపావు. నీమనసు అప్పుడే కరిగిపోయిందని నాకు తెలుసులే పద.


నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకసలు కోపమేలేదు. నువ్వురాగానే వాటేసుకుని అలానే ఎంతకాలమైనా ఉండిపోవాలనే అనుకున్నా. అయినా నా పౌరుషం అడ్డుపడింది. అందుకే కోపం నటిస్తూ "నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు" అన్నాను. అదంతా ఉత్తుత్తికోపమే. నాగురించి నీకు తెలుసుకదా? నేనన్నానే అనుకో నీకెక్కడి పోయిందోయ్? నువ్వు చెప్పే తీయతీయని కబుర్లను వింటూ కరిగిపోయేదాన్ని కదా? నా ఆశలకు మూలపురుషుడైన శ్రేవేంకటపతీ, విసుక్కున్నది చాలు! రతికి జతపడుదాం రాయిక.




================================================================

rAgaM : Sree rAgaM

pallavi

paMtamu chellenu badagadarA
yiMtalOna dappu leMchaka padarA

charaNaM 1
rAni kOpamuna ravva sEsiti niMtE
pAnupumeediki badagadarA
sOnalachemaTala solasiti niMtE
tEnemOvi dappi dErche badarA

charaNaM 2
anumAnAneeku naligiti niMtE
pani gala dika naTu padagadarA
nanu niTu chUDaga navviti niMtE
tanipE neemati tAvuku padarA

charaNaM 3
pAsina kAkala balikiti niMtE
bAsalu nammiti badagadarA
Asala SreevEMkaTAdhipa kUDiti
vEsArapurati venakaku badarA

=============================================================

17 August 2011

వత్తిలోపలి నూనెవంటిది జీవనము...

మనిషి జీవితాన్ని నడిపించే ప్రధాన సారథి మనసు. తీరని కోర్కెలకు నెలవు ఈ మనసు. అందులో అన్నిరకాల కోరికలూ కలుగుతాయి. ఆ మనసు ఆజ్ఞాపించినట్టు కర్మలు చేస్తుంటాం. ఏ కోరిక చేయించిన కర్మ జీవున్ని పరిశుద్ధము చేస్తుంది, ఏ కోరిక చేయించిన కర్మ బురదలోకి తోస్తుందో విచక్షణముతో ఎన్నుకోవాలి. ఆ విచక్షణ ఎలా వస్తుంది మరి? అది రావాలంటే భగవత్తత్వం మీదకి మనసుని అప్పుడప్పుడూ మఱలిస్తుండాలి.

ఇప్పుడు మఱలిద్దాం‌రండి...


ఏమి గొప్పలున్నాయ్ ఈ మానవ జీవితంలో? ఎందుకిన్ని పోరాటాలు చేస్తున్నాం? ఇన్నిపోరాటాలు చేయిస్తూ జీవితాన్ని ముందుకు నడిపేది ఏది? ఆశ! కడ మొదల లేని ఈ వాంఛలతో నిండియున్న మనసుని నడిపించేది అదే. ఇన్ని పోరాటాలు, కష్టాలూ ఆ మనసు వాంఛ తీర్చేందుకే. అయితే ఇవన్ని వృథాయే. ఎన్ని సాధించినా వ్యర్థమే. ఎందుకంటే, ఇవేవి జీవుడుకి పరమార్థాన్ని సంపాదించిపెట్టేవి కావు.

ఈ జీవితం శాశ్వతమేమి కాదు. వత్తిలో నూనె ఉన్నంతవరకే దీపం వెలుగు. ఆ నూనె అయిపోతే చీకటే. అలా దేహములో కంటికి కనబడక జీవితాన్ని నడిపించేది ప్రాణం! ఆ ప్రాణం ఉన్నంతవరకే ఈ దేహానికి అన్నియాటలూ. నిజానికి ఈ దేహాం కూడా వ్యర్థపదార్థమే! గింజమీద ఎలాగైతే పొట్టు ఉంటుందో అలాగే ఆ ప్రాణాన్ని లోపలనిలుపుకున్న పొట్టు ఈ దేహం. మొలకొచ్చేవరకే పొట్టుయొక్క అవసరం విత్తనానికి. ఆ పైన ఆ పొట్టు వ్యర్థ పదార్థమే కదా? మఱి అటువంటి వ్యర్థపదార్థమైన ఈ దేహాం సుఖాలదారివైపుకే పాకులాడుతుంది. ఆ దేహాన్ని ప్రాణంకోసం వాడుకోవాలికానీ, ప్రాణాన్ని దేహంకోసం కాదు. దేహానికి భక్తి అంటదు. శాశ్వతము కాని ఈ దేహం కోరుకునే శారీర సుఖాలవైపుకి వెళ్ళకుండ మనసుని అదుపులో ఉంచుకోవడమే ప్రధానము.

ధనముంటే మనచుట్టూ  ఎంతమందైనా చేరుతారు. మనకన్నా గొప్పవారు లేరని పొగుడుతారు. పొగడ్తలకు మురిసిపోతాము. ఆ పొగడ్తల మత్తుకోసం ఇంకా ఇంకా ఎక్కువ సిరిసంపదలు కావాలనుకుంటాం. చాకలి మడుగులో బండకేసి ఉతుకుతుండగా ముఱికి ఎలాగైతే బట్టలను వదలిపోవునో అలా వదిలెళ్ళిపోయేటివే మనం అష్టకష్టాలుపడి సంపాదించే సిరులూ, సంపదలూ. ప్రాణం ఈ దేహాన్ని వదిలినప్పుడు ఆ సంపదలేవీ మనతో రావు. అటువంటి ఐశ్వర్యాలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత?

ఈ బ్రతుకు ఎంత నీచమైనదీ? ఈ పొట్టని నింపుకునేందుకు ఎన్నెన్ని పాపములు చేయిస్తుంది? మనం చేసిన పాపాలన్నిటికీ, గాదేలోపోసిన ధాన్యంలాగా లెక్క రాయబడి ఉంది ఆ పైవానివద్ద. ఈ పాపాలనుంచీ, వేదనలనుంచీ మోక్షములేదా? ఎందుకు లేదు? ఆ వేంకటేశుని మనస్పూర్తిగా “నువ్వే శరణని” అర్థించినవారికి ఆయన కృపాకటాక్షమనేటి తాడు చేచిక్కుతుంది. ఆ తాడుపట్టుకుని మోక్షము చేరుకోవచ్చు అంటారు అన్నమయ్య.

===================================
రాగం : వరాళి
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
====================================
పల్లవి

ఏమిగల దిందు నెంతపెనగిన వృథా
కాముకపు మనసునకు కడమొదలు లేదు

చరణం 1
వత్తిలోపలినూనెవంటిది జీవనము
విత్తుమీదటిపొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక


చరణం 2
ఆకాశపాకాశ మరుదైన కూటంబు
లోకరంజనము తమలోనిసమ్మతము
చాకిమణుగులజాడ చంచలపు సంపదలు
చేకొనిననేమి యివి చెదరినను నేమి

చరణం 3

గాదెబోసినకొలుచు కర్మిసంసారంబు
వేదువిడువనికూడు వెడమాయబతుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరునికృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

ఏమిగలదిందు = ఏమున్నది ఈ జీవితంలో
ఎంత పెనగిన = ఎంత పోరాటము చేసిన
వృథా = ఫలములేదు, వ్యర్థము
కాముకపు = మాయామోహితమైన
కడమొదలు = ఎప్పుడు మొదలైందో ఎప్పుడు తెగుతుందో


వత్తి = Wick
విత్తు = గింజ, విత్తనము
పొల్లు = కింజపైనున్న పొట్టు, తవుడు
బత్తి = భక్తి, నమ్మకం, Faith
పాసి = చెడిన, పాడైన, మలినము
పొత్తులసుఖంబులు = దేహసుఖాలు
పొరలుట = తపించడము

అరుదైన = అపూర్వమైన
లోకరంజనము = విలాసము
లోకరంజనము = లోకాన్ని సంతోషపెట్టేది
చాకిమణుగు = చాకలివాళ్ళు బట్టలు ఉతికే మడుగు
చంచలపు = స్థిరములేనిది, చంచలమైన
చేకొనిననేమి = సంపాదించితేనేమి, దాచుకొన్ననేమి

గాదె = ధాన్యము Store చేసుకోవడానికి పూర్వకాలంలో వాడబడిన మట్టి పాత్ర (ఇది cylinder shape లో ఉంటుంది. 5-6 అడుగుల ఎత్తుంటుంద)
కర్మి = పాపముచేసినవాడు
వేదువిడువని = వెగటుకలిగించని
కూడు = ఆహారం
వెడమాయబతుకు = నీచమైన బ్రతుకు ("తూ జీవితం" అంటాం కదా?‌అలా అన్నమాట...)
ఏడతెగు = విడిపోవు
మోదంబు = విలాసము, సంతోషము
వడిసిన = లాగితే (వడము = త్రాడు, మోకు)

తాత్పర్యం :
ముందుమాటగ రాసినదంతా కీర్తనయొక్క తాత్పర్యమే.

=================================================

rAgaM : varALi

pallavi
Emigala diMdu neMtapenagina vRthA
kAmukapu manasunaku kaDamodalu lEdu

charaNaM 1
vattilOpalinUnevaMTidi jeevanamu
vittumeedaTipollu vidhamu dEhaMbu
battisEyuTa yEmi pAsipOvuTa yEmi
pottulasukhaMbulaku poraluTalugAka

charaNam 2
AkASapAkASa marudaina kUTaMbu
lOkaraMjanamu tamalOnisammatamu
chAkimaNugulajADa chaMchalapu saMpadalu
chEkoninanEmi yivi chedarinanu nEmi

charaNaM 3
gAdebOsinakoluchu karmisaMsAraMbu
vEduviDuvanikUDu veDamAyabatuku
vEdanala neDateguTa vEMkaTESwarunikRpA-
mOdaMbu vaDasinanu mOkshaMbu ganuTa

============================