26 June 2012

విరహపు మేన మల్లెలు పూచే...

పురుషోత్తముని కలయికకై ఉవ్విళ్ళూరుతోంది పదహారేళ్ళ పడతి శ్రీదేవి. ఆ స్థితిని గమనించిన చెలికత్తెలు ఆమె మదిభావాలను (విరహ వేదనను) పలురకాల పువ్వులతో పోలుస్తున్నారు. కవులు మగువల్ని పువ్వులతోపోల్చడం సహజం;  అన్నమయ్య చూపే వైవిధ్యం ఎంత కొత్త పుంతలు తొక్కుతుందో చూడండి! మరులుగొన్న శ్రీదేవి మదిలోనూ తనువులోనూ జరిగే మార్పులను అందమైన పువ్వులతో ఉదాహరించారు.

అందం మగువ సహజ లక్షణం. అటువంటిది ఆమె ప్రేమలో పడినప్పుడు ఆ అందం పలురెట్లవుతుంది. గుండెలు నిండిన వలపుతో ప్రియునికై తపించే ఆ పడతి "పూవక పూచిన పూవై" ఎలా వికసించిపోతుందో చెలికత్తెల మాటల్లో వినండి.

======================== 
AUDIO
(నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరకల్పన)
========================

పొలితి జవ్వనమున బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే
సతి చింతాలతలలో సంపెగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోత నడవిజాజులు పూచె
హితవు తెలియ దిక నేమి సేసేదే
తొయ్యలిచెమటనీట దొంతిదామెరలు పూచె
కొయ్యచూపు గోపముల గుంకుమ పూచె
కయ్యపు వలపుల జీకటిమాకులు పూచె
నియ్యెడ జెలియభావ మేమి సేసేదే
మగువరతులలోన మంకెన పువ్వులు పూచె
మోగి గొనగోళ్ళనే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశుపొందుల గప్రము పూచె
ఇగురు బోండ్ల మిక నేమి సేసేదే

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
పొలితి = పడతి, మగువ, ఇంతి
జవ్వనము = పదహారేళ్ళ ప్రాయం
బూవక = పూవక
ఎలమి = వికాసము, సంతోషము

చింతాలతలు = చింత+లతలు = అల్లుకుంటున్న ఆలోచనలు
సంపెగ = సంపంగి పువ్వు
తలపోత = వెన్నాడే తలపు, విచారము

తొయ్యలి = మగువ, పడతి
దొంతితామెర = పలురేకులున్న కలువపూవు
కొయ్యచూపు = ప్రేమలేని చూపు
గోపముల => కోపముల
గుంకుమ => కుంకుమ =  కుంకుమపువ్వు [safron]
కయ్యపు = జగడము, గొడవ
జీకటిమాకులు  => చీకటిమాకులు = కదంబం; అంటే కడిమి చెట్టు (కృష్ణుడికి ప్రీతిపాత్రమైనది)
ఇయ్యెడ = ఇక్కడ
జెలియ => చెలియ

మగువ = పడతి, ఆడది, స్త్రీ
మంకెన = ఎర్రటి రంగు పువ్వు [Pentapetes phoenicea]
మొగి = వరుస
మొగలి = Pandanus odoratissimus
గప్రము = కర్పూరము
ఇగురు =  చిగురు
బోండ్లము = అమ్మాయిలు 

తాత్పర్యం / Meaning :
మొగ్గదశనుండి పూవుగా ఇప్పుడే వికసించినట్లు బాల్య ప్రాయంనుండి యౌవనంలోకి అడుగిడిన పదహారేళ్ళ ఈ పడతి ఆనందించేందుకు మనము చేయగలిగినదేముందే? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

పురుషోత్తముని సతీమణియైన ఈమె మదిలో ఆయన గూర్చి అల్లుకుపోతున్న ఆలోచనలు (చింతాలతలు కదా!) సంపంగిపువ్వుల్లా పూచాయట. ఇక్కడ సంపంగి పూవులనెందుకు ఉపమానంగా వాడారో గమనించాలి. సంపంగి మొగ్గలు విచ్చుకుని పరిమళాన్ని వెదజల్లేది సాయంత్రం సమయాల్లోనే. నిత్యం అతని తలపుల్లోనే తేలియాడుతూ ఉన్నా మలిసంజవేళే కదా ఉద్రేకమైన వలపు భావనలు కలిగేది? అందుకే సంపంగి పూవుల్లా పూచాయట ఆమె మదిలోని తలపులు. ఇంకాస్త సమయం గడిచింది. ఆమె విరహం మల్లెపూవులా పూచిందట. మల్లెలెందుకంటారా? మల్లెల సువాసన మత్తెక్కిస్తుంది; పడతి విరహస్థితి కూడా అదే కదా? మరింత సమయం గడిచింది. ఆ సరసుడు సరసన లేడు; అతని తలచుకుంటూ ఇంకా రాలేదేమని విచారపడుతూ నిట్టూరుస్తుంది. ఆ నిట్టూర్పుల తీవ్రత మామూలు జాజుల్లా కాకుండా అడవిజాజులంత హెచ్చుగా ఉందట. "ఈమెకొచ్చిన ఈ కష్టాలు సుఖాలవ్వడానికి మనమేమి చెయ్యగలమే?" అని చెలికత్తెల భావన.

రెండో ఝామైంది; స్వామి రాలేదు. విరహం ఝాము ఝాముకీ హెచ్చింది. తాపాన మరిగిన ఆమె మేను ముచ్చెమటల ఏరయ్యింది. సొగసులు నీట మెరిసే తామరల్లా పూచాయి. దొంతితామరలట! అప్పుడొచ్చాడా కమలనాథుడు. ఏ తొలిఝామో నాయకుడింటికి వచ్చుంటే పాదప్రక్షాళనకు నీళ్ళిచ్చి, చిరునవ్వుల పూవులు గుప్పించి ఆహ్వానించుండేది. ఇలా రెండోఝాము సమయానికొస్తే ఏం చేస్తుంది నాయిక? అదే.. అదే.. నిప్పులుకక్కేంతలా కోపంగా కోయ్యచూపులు చూసిందట. అప్పుడు ఆమె ముఖమూ, కళ్ళూ కుంకుమపువ్వులు పూచినట్టు ఎరుపెక్కాయట. కోపం ఎదిగితే ఏమవుతుంది? గొడవవుతుంది. సిరి హరితో కయ్యానికి దిగి అలిగింది! ఆమె నవ్వులు లేని ఆ రేయి మరింత నల్లబడిందట. కడిమి పూచినంత మనోహరంగా ఆమె అలకలు పూచాయి. చీకటిమాకులు పూచాయని, ప్రేమ నిండిన అలక కూడా చక్కనిదేనని చెప్తున్నారు. అందగత్తె ఏ కళనున్నా అందమే కదా! "స్వామి ఇంటికొచ్చేంతవరకేమో రాలేదే అని బెంగపెట్టుకుంది వచ్చాకేమో దెబ్బలాడుతుంది. ఈ సత్యభామ ప్రవర్తన మనకర్థం కాదే!" అని నొచ్చుకుంటున్నారు చెలికత్తెలు.

తలపోతా, నిట్టూర్పూ, విరహం, కోపం, కయ్యం, అలక - ఇదీ వరుస.  అలక తరువాత ప్రణయం బహు తీయనిది. చురకలూ చెణుకులతో మొదలై గారాలతో సరాగాలలోకి దారితీస్తుంది. గమ్యం వారి కలయిక - వలపుల శిఖరాలు చేరిన ఆ సొగసరి ఎర్రని కోమలమైన మంకెనలా వికసించింది. రతికేళి వేళ స్వామి మునిగోళ్ళు ఆమె కోమల దేహం పై ఏర్పరచిన జాబిలిబుడుగులు మొగలి రేకుల్లా పరిమళించాయి. శ్రీవేంకటేశుని మనసు దోచిన దొరసానినని గర్వించే ఆ పడతి పొగరంతా పరవశించి పవళించిన ఈ వేళ కర్పూరంలా పూచి గాలిలో కరిగిపోయింది అని చెలికత్తెలు "కన్నెపిల్లలం మనకేం తెలుసే వారి వలపులు!" అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.





=======================================
[ Lyrics in RTS format ]

politi javvanamuna bUvaka pUche
yelami niMduku manamEmi sEsEdE

sati chiMtAlatalalO saMpegapUvulu pUche
mativirahapu mEna mallelu pUche
atanunitalapOta naDavijAjulu pUche
hitavu teliya dika nEmi sEsEdE

toyyalichemaTaneeTa doMtidAmeralu pUche
koyyachUpu gOpamula guMkuma pUche
kayyapu valapula jeekaTimAkulu pUche
niyyeDa jeliyabhAva mEmi sEsEdE

maguvaratulalOna maMkena puvvulu pUche
mOgi gonagOLLanE mogali pUche
pogaru SreevEMkaTESupoMdula gapramu pUche
iguru bOMDla mika nEmi sEsEdE


=======================================